Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ వారసులను మీరే డిజైన్ చేసుకోవచ్చు

పుట్టబోయే బిడ్డకు ఎంత మేథావితనం ఉండాలో, ఎంత అందంగా ఉండాలో, ఏ లక్షణాలు కావాలో మీరే డిజైన్ చేసుకోవచ్చు. అందుకు తగ్గ జన్యువులను మీరు సంపాదించుకుంటే సరి. వాటిని పుట్టబోయే బిడ్డలో ఉండేలా జన్యుమార్పులు చేస్తారు వైద్యులు. జన్యుపరంగా మార్పులు చేసిన విత్తనాలు గురించి మీరు వినే ఉంటారు. అలాగే ఇప్పుడు జన్యుపరంగా మార్పులు(జీఎం) చేసిన బేబీలు అన్నమాట. ఇలాంటి కృత్రిమ విధానాన్ని అమెరికాలో ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టారు శాస్త్రవేత్తలు. అంతేకాదు అనేక ప్రయోగాల అనంతరం 30 మంది జీఎం బేబీలు అమెరికాలో కళ్లు తెరిచారు. వీరిలో ఇద్దరు బేబీలలో ముగ్గురి జీన్స్ ఉన్నట్లు నిర్ధారించారు.

గత రెండేళ్లలోనే అమెరికాలోని న్యూజెర్సీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సైన్స్ కేంద్రంలో 15 మంది జీఎం బేబీలు పుట్టారు. పలు సమస్యలతో బాధపడుతున్న ఒక మహిళ అండంలోకి, మరొక మహిళ జన్యువులను ప్రవేశపెట్టారు. ఈ తల్లికి పుట్టిన ఇద్దరు బేబీల డీఎన్ఏలో తల్లి, తండ్రి, దాత ముగ్గురి జన్యువులు ఉన్నాయని వెల్లడైంది. అయితే, ఈ పరిశోధనలు భవిష్యత్తులో విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని జన్యుశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News